Viewing:

సంఖ్యా Numbers 24

Select a Chapter

1ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు ఇంతకు ముందు లాగా శకునం చూడడానికి వెళ్ళకుండా ఎడారి వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు.

2బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు. 3అతడు ఇలా ప్రవచించాడు.

“బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు.

కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.

4అతడు దేవుని మాటలు మాట్లాడతాడు,

దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు,

ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు.

5యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి.

ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!

6అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి.

7అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి.

అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి.

వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు.

వారి రాజ్యం ఘనత పొందుతుంది.

8దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు.

అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది.

అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు.

వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.

9అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు.

అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు?

అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు.

10అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో “నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు. 11నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు” అన్నాడు.

12అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను, 13యెహోవా ఏం చెప్తాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరికి పంపించిన నీ వర్తమానికులతో నేను చెప్పలేదా? 14కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి” అన్నాడు.

బిలాము నాలుగో సందేశం

15బిలాము ప్రవచనం చెప్పాడు. “బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు, కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు.

16ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం.

మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం.

సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం.

ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు.

17నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు.

నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు.

ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది.

రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది.

అతడు మోయాబు నాయకులను పడగొడతాడు.

అతడు షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.

18ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు.

వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు.

బిలాము చివరి సందేశం

19యాకోబు సంతానంలోనుంచి రాజ్యాధికారం వస్తుంది.

అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు” అన్నాడు.

20ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం. కాని దాని అంతం నాశనమే” అన్నాడు.

21తరువాత బిలాము కేనీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది.

నీ గూడు బండరాళ్ళల్లో ఉంది.

22కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది” అన్నాడు.

23అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ “అయ్యో! దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు?

24కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి.

అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి.

కిత్తీయులు కూడా నాశనమౌతారు” అన్నాడు.

25అప్పుడు బిలాము లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు కూడా వెళ్ళిపోయాడు.