Viewing:

సంఖ్యా Numbers 34

Select a Chapter

కనాను దేశంలో ఇశ్రాయేలీయుల సరిహద్దులు

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, 2‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు. 3మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది. 4మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది. 5అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.

6మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది. 7మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా, 8హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ, 9అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.

10తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి. 11అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది. 12అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”

13మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు. 14ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు. 15అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు. 16అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 17“ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ. 18వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.

19వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు, 20షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు, 21బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు. 22దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు. 23యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు, 24ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు, 25జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు, 26ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు, 27ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు. 28నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.” 29వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.