Viewing:

సామెత Proverbs 17

Select a Chapter

1ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది.

2బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు.

3వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.

4చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.

5పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.

6మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే.

7అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.

8లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.

9ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.

10బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది.

11దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.

12మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.

13మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.

14పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.

15దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం.

16బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా?

17స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

18తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.

19కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు.

20దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.

21బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు.

22ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.

23న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.

24వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి.

25బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు.

26మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు.

27జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు.

28మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.